తమన్నా ఇప్పుడు ఒక వైపున సినిమాలతో .. మరో వైపున వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఆమె నుంచి మరో భారీ వెబ్ సిరీస్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరే ‘ఆఖరి సచ్’. నిర్వికార్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ వెబ్ సిరీస్ కి, రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇది ‘హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ కానుంది. సౌరవ్ దేవ్ కథను అందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో తమన్నా ప్రధానమైన పాత్రను పోషించింది. ఆమె ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. తన కెరియర్ లో మొదటిసారిగా ఆమె ఈ తరహా పాత్రను పోషించింది. అభిషేక్ బెనర్జీ .. శివిన్ నారంగ్ .. సంజీవ్ చోప్రా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతారు. వాళ్లంతా ఉరేసుకున్నారని రికార్డులు చెబుతుంటాయి. కానీ వాళ్లలో 9 ఏళ్ల నుంచి 71 ఏళ్ల వయసును కలిగినవారు ఉంటారు. ఇది హత్యలా? ఆత్మ హత్యలా? అనే విషయాన్ని తేల్చడానికి ‘ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ‘అన్య’గా తమన్నా రంగంలోకి దిగుతుంది. ఈ కేసు విషయంలో ఆమెకి ఎదురయ్యే సవాళ్లే కథ.