బీఆర్ఎస్ గతంలో కంటే మరింత బలపడిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి ఈ రోజు కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే సురేందర్ 2001 నుండి సోదరుడిలా కేసీఆర్ వెంట ఉన్నారని ప్రశంసించారు. తెలంగాణ రావాలని చిత్తశుద్ధితో పని చేశారన్నారు. 2018లో భారీ మెజార్టీతో గెలిచారన్నారు. కేసీఆర్‌ను ఎమ్మెల్యే సురేందర్ ఎప్పుడు కలిసినా ఎల్లారెడ్డి అభివృద్ధి గురించే అడుగుతారన్నారు.

కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని చెబుతున్నారని, కానీ కేసీఆర్ మాత్రం మూడు పంటలు అంటున్నారన్నారు. బీజేపీ అయితే మతం పేరిట మంటలు పెడుతోందన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు కావాలి? రాబంధులు కావాలా? రైతు బంధు కావాలా? ప్రజలు తెలుసుకోవాలన్నారు.

గడప గడపకూ కాంగ్రెస్ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కానీ ఏం చేయడానికి అని ప్రశ్నించారు. 50 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందేం లేదన్నారు. షబ్బీర్ అలీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయని పనులు ఇప్పుడు బీఆర్ఎస్ కామారెడ్డిలో చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎంత ఇబ్బందిపడ్డామో అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గినప్పటికీ, మనవద్ద తగ్గడం లేదని, దీంతో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు. దేశ రాజకీయాలను ఒప్పించి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ అన్నారు.