తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మెట్రోలో ప్రయాణించారు. ఈ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకులు ప్రచారం కోసం అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎల్బీ నగర్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ కూడా మెట్రోలో ప్రయాణికులను కలిసి మాట్లాడారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ కూడా మెట్రోలో ప్రయాణించారు. హెచ్ఐసీసీలో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో హైదరాబాద్ భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించిన అనంతరం రాయదుర్గం నుంచి బేగంపేట్ వరకు ప్రయాణించారు. దాదాపు ఇరవై నిమిషాలు ప్రయాణికులతో ముచ్చటించారు. కేటీఆర్‌తో మాట్లాడేందుకు వందలాదిమంది ప్రయాణికులు ఉత్సాహం చూపించారు.  కేటీఆర్ తన 20 నిమిషాల ప్రయాణంలో పలువురితో ముచ్చటించారు. ఇంటర్మీడియట్ చదువుతూ వైద్య విద్య కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినితోపాటు, ఇప్పటికే ఎంబిబిఎస్ కోర్స్ చదువుతున్న మరో విద్యార్థి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. జర్మనీలో బయోటెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న మరో ప్రయాణికుడు కేటీఆర్ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మెట్రోలో ఎక్కిన పలువురు విద్యార్థినిలు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థినుల బృందం హైదరాబాద్ నగరంలో మెడికల్ కోడింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. పలువురు మహిళలు, వృద్ధులతో ముచ్చటించారు.