తెలంగాణ రాకముందు నిజామాబాద్ నగరంలో దయనీయ పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో ఆమె రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రానున్న ఐదేళ్లలో పేదల సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నిరుపేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని కవిత పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు.పేదలకు ఎంతో ఉపయోగపడే మేనిఫెస్టోను తాము తయారు చేశామన్నారు. కేసీఆర్ ఏదైనా చెప్పారంటే తప్పకుండా చేసి చూపిస్తారన్నారు. కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక్కటే మైనార్టీ పాఠశాల ఉండేదని, ఇప్పుడు జిల్లాలో 23 మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో పని చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని కోరారు. గత పదేళ్లలో తెలంగాణలో ఎక్కడా కూడా మత ఘర్షణలు జరగలేదని, రానున్న ఐదేళ్లలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్‎లో 3200 ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు.