బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. నిన్న గజ్వేల్ లో ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దాదాపు ఆరు గంటలసేపు ఆయనను విచారించారు. అనంతరం నిన్న రాత్రి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్ తో పాటు, ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వీరికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ప్రశాంత్, ఆయన సోదరుడిని చంచల్ గూడ జైలుకి పోలీసులు తరలించారు. 

బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట పల్లవి ప్రశాంత్ అభిమానులు రచ్చ చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అమర్, అశ్విని, బిగ్ బాస్ సీజన్6 కంటెస్టెంట్ గీతూ రాయల్ కార్లను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ క్రమంలో వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిపై కాకుండా కార్యక్రమ నిర్వాహకులు, హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునపై కూడా కేసులు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.