ఎన్డీయేలో టీడీపీ చేరికపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇరువురు సమావేశమవబోతున్నారు. ఈ భేటీలో పొత్తుపై చర్చించనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ఇదివరకే అమిత్ షాను కలిశారు. అయితే పొత్తుపై ఎలాంటి ప్రకటనా రాలేదు. నేటి భేటీలో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి రెండవ జాబితాపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు, పవన్ బుధవారం కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ చర్చించారు. అభ్యర్థుల రెండో జాబితా నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై దాదాపు గంటన్నరపాటు ఇరువురు చర్చించినట్టు సమాచారం.