ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని పిలుపునిచ్చామని… ప్రజలు గెలిచి కూటమిని గొప్ప స్థానంలో నిలబెట్టారని కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యతలేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని వివరించారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నామని అన్నారు. “విద్యుత్ తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. విద్యుత్ రంగంపైనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉన్నాయి. 2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది. ఈ ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. అసమర్థులు పాలన చేస్తే ఇలాగే ఉంటుంది.