తెలంగాణ ప్రజలకు నీళ్లు తాగించింది.. కరెంటును పరిచయం చేసింది తామేనన్నట్లు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై జరుగుతున్న స్వల్ప కాలిక చర్చలో మంత్రి మాట్లాడారు. విద్యుత్ రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్  రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు కిరసనాయిల్ దీపం ముందు కూర్చుని చదువుకునే వారని చెప్పారు.

దీనిపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. 2014 కు ముందు తెలంగాణలో విద్యుత్ సౌకర్యమే లేనట్లు జగదీశ్వర్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. బుధవారం తాగు, సాగు నీటిపై చర్చ సందర్భంగా కూడా ప్రతిపక్ష నేతలు ఇదే విధంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణకు విద్యుత్ ఇచ్చింది గత కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని గుర్తుంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు.