ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ్ ముఖానికి గాయాలైనట్టు సమాచారం. ఎస్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ షూటింగ్ ప్రారంభానికి ముందు ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ కు ప్రాథమిక చికిత్స అందించారు. వెంటనే షూటింగ్ ప్రారంభించడానికి అనుకూలంగా లేకపోవడంతో, పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలిసింది. దీంతో ఆయన నటించాల్సిన గేమ్ చేంజర్ సినిమా తదుపరి చిత్రీకరణ కొన్ని రోజుల పాటు వాయిదా పడినట్టు సమాచారం. రామ్ చరణ్ గాయంపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఈ విషయం తెలిసిన వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. అక్టోబర్ మొదటి వారంలో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి స్టంట్ కొరియోగ్రాఫర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కానుంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే రామ్ చరణ్ తిరిగి చిత్రీకరణలో పాల్గొననున్నాడు.