చంద్రబాబు పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకు ‘వ్యూహం’ సినిమా తీశారని, ఆ సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

లోకేశ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… వ్యూహం చిత్రం విడుదలపై ఆంక్షలు విధించింది. వ్యూహం చిత్రాన్ని ఓటీటీ, ఆన్ లైన్, ఇంటర్నెట్ వేదికల్లో విడుదల చేయొద్దని సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వ్యూహం చిత్ర నిర్మాణ సంస్థ రామదూత క్రియేషన్స్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, నారా లోకేశ్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.