పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీరిక లేకుండా ఉంటూనే మరోవైపు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే వేసవిలో దీనిని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ జరుగుతోంది. ప్రత్యేక సెట్‌లో నాన్‌ స్టాప్‌గా చిత్రీకరణ జరుగుతోంది. రెండు రోజలు కిందటే పవన్ కల్యాణ్ సెట్‌లో జాయిన్‌ అయ్యారు. రామ్‌ లక్ష్మణ్ ఆధ్వర్యంలో  ప్రస్తుతం ఫైట్ సీక్వెన్సులు చిత్రీకరిస్తున్నారు. పవన్‌ అభిమానులు ఖుషీ అయ్యేలా షూటింగ్‌ స్పాట్‌లో తీసిన ఆయన ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్‌‌ చేసింది. ఇందులో పవర్ స్టార్ ఖాకీ డ్రెస్సులో ఖరత్నాక్ లుక్‌లో కనిపిస్తున్నారు. షూటింగ్ కోసం తన సెక్యూరిటీ సిబ్బందితో నడిచొస్తున్న ఫొటోతో పాటు పోలీస్ జీప్ వద్ద ఆయనకు దర్శకుడు హరీశ్ శంకర్ సీన్‌ వివరిస్తున్న మరో ఫొటో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 2016లో విడుదలైన తమిళ సినిమా ‘తేరి’ ఆధారంగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, చేకూరి మోహన్‌ నిర్మిస్తున్నారు. శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.