ప్రముఖ నటులు అల్లు అర్జున్, కృతి సనన్‌.. ఉత్తమ నటులుగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘పుష్ప’ సినిమాకు గాను బన్నీకి, ‘మిమి’ సినిమాకు కృతి ఉత్తమ నటులుగా అవార్డులు పొందారు. మరో నటి ఆలియా భట్‌తో కలిసి సంయుక్తంగా కృతి ఈ అవార్డు స్వీకరించారు.   కాగా, అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కృతి, బన్నీ పక్కపక్కనే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. అంతేకాకుండా.. ‘తగ్గేదే లే’అన్న పోజులో ఇద్దరూ కలిసి ఓ సెల్ఫీ కూడా దిగారు. ఐవరీ రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న తమ ప్రియతమ యాక్టర్లను చూసుకుని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దీంతో, ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వేడుకల్లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంట కూడా తళుక్కుమన్నారు. ఆలియా తన పెళ్లిలో కట్టుకున్న చీరతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరైంది. ఇక ‘మిమి’ చిత్రానికి గాను పంకజ్ త్రిపాఠీ ఉత్తమ సహాయక నటుడి అవార్డును గెలుచుకున్నాడు.