రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన అనంతరం లోకేశ్ తో కలిసి నందమూరి బాలకృష్ణ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై దెబ్బకు దెబ్బ… వేటుకు వేటే అంటూ సమరశంఖం పూరించారు. కేసులకు భయపడాల్సింది తాము కాదని, వైసీపీ నేతలేనని అన్నారు. తాము అవినీతికి పాల్పడలేదు కాబట్టే భయపడడంలేదని స్పష్టం చేశారు. ఇవాళ పవన్ కల్యాణ్ రాజమండ్రి వచ్చి చంద్రబాబును కలిశారని, పోరాటంలో కలిసివస్తామని జనసేన తరఫున మద్దతు ప్రకటించారని బాలకృష్ణ వెల్లడించారు. తాము మరింత బలపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే యుద్ధం ప్రకటించామని, ఈ యుద్ధంలో పవన్ భాగస్వామ్యం కలవడం శుభపరిణామం అని అభివర్ణించారు. జగన్ ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని బాలయ్య వ్యాఖ్యానించారు. తప్పులు చేసిన వారంతా బయట ఉన్నారని, రాష్ట్రం బాగుండాలని కృషి చేసిన చంద్రబాబు జైల్లో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు.ఇలాంటి కేసులకు, బెదిరింపులకు తాము భయపడే రకం కాదని, న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తమను నైతికంగా దెబ్బతీయాలని చూస్తే మరింత బలపడతామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉందని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

Previous article సెంట్రల్ జైల్ వద్ద లోకేశ్ ను హత్తుకున్న పవన్ కల్యాణ్.. ఫొటోలు ఇవిగో!
Next articleఉస్తాద్’​ సెట్‌ నుంచి పవర్‌‌ స్టార్​ ఫొటోలు.. ఖాకీ డ్రెస్సులో ఖతర్నాక్​ లుక్​