టీడీపీ అధినేత చంద్రబాబుపై అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. 48 గంటల్లోగా ఈ ఫిర్యాదులకు సంబంధించి వివరణ ఇవ్వాలని మంత్రి జోగి రమేశ్‌, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి గురువారం వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోపు స్పందించక పోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతామని హెచ్చరించారు. చంద్రబాబుపై జోగి రమేశ్‌ చేసిన ఆరోపణలలే కాకుండా అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో తప్పుడు పోస్టులు పెట్టారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు సంఘటనల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించామని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వివరిస్తూ ఈసీ ఇచ్చిన పత్రికా ప్రకటనలోని 47వ పేరాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వంపై దాడి, నిరాధార ఆరోపణలు చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. వర్ల రామయ్య సమర్పించిన ఆధారాలు, వీడియోల్లో ప్రవర్తనా నియమావళిని మీరు ఉల్లంఘించినట్లు తెలుస్తోందని జోగి రమేశ్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో చంద్రబాబుకు దురుద్దేశాలు ఆపాదిస్తూ అభ్యంతరకర పోస్టులు ఉంచారని ఈ నెల 1న వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వీటిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనేనని ,ఆయన సమర్పించిన ఆధారాలను బట్టి ఇదే విషయం స్పష్టమవుతోంది అని అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ దొడ్డిదారిన అధికారంలోకి రావాలని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య అన్నారు . ప్రధాని మోదీతో పాటు , చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పోటోలు వేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు . దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్.. 2004లో జగన్ 2 లక్షల ఆసామని ,.. నేడు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.