టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రశాంతతకు మారుపేరు కోనసీమ అని, గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా? అని ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని, కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రం మళ్లీ నిలబడాలి, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్న ఉద్దేశంతో మేం ముగ్గురం కలిసి మీ ముందుకు వచ్చాం అని చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కూటమిదే గెలుపు అని, నూటికి నూరు శాతం మనమే గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.