‘పాతతరం రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండేవి.. ఎన్నికల తర్వాత అధికార ప్రతిపక్ష నేతల దృష్టి అభివృద్ధిపైనే ఉండేది. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు ఇలాంటి రాజకీయమే కావాలి. పాత తరం రాజకీయం రావాలి’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో మంగళవారం నిర్వహించిన ‘బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్’ కార్యక్రమంలో అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ వాసులను లోకేశ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. 

గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లాంటివారు ముఖ్యమంత్రులుగా ఉన్నపుడు విమర్శలు కేవలం విధానపరంగా మాత్రమే ఉండేవని, రాజకీయాలు హుందాగా ఉండేవని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో హుందాతనం పూర్తిగా నశించిందని ఆరోపించారు. వ్యక్తిగత, విద్వేషపూరిత వ్యాఖ్యలతో రాజకీయ నేతలు ముఖాముఖాలు చూసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. రాజకీయాల్లో ఇది వాంఛనీయం కాదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. విధ్వంసం, కక్ష సాధింపు, డబ్బుతోనే రాజకీయాలు సాధ్యంకాదన్న విషయం గమనించాలని జగన్ కు హితవు పలికారు.