గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త ప్రాజక్టుకు శ్రీకారం చుట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రం హైదరాబాదులో నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. రామ్ చరణ్ కెరీర్ లో ఇది 16వ చిత్రం. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. 

నేడు ముహూర్తం షాట్ కు మెగాస్టార్ చిరంజీవి, దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్, సంగీత స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు సుకుమార్, సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తదితరులు హాజరయ్యారు. 

ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే రామ్ చరణ్ 16వ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 

త్వరలోనే ఇతర తారాగణం వివరాలు ప్రకటించనున్నారు. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.