తమిళ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌‌ స్టార్‌‌గా పేరు పొందింది నయనతార. నటనతోనే కాదు.. తన తీరుతోనూ వార్తల్లో నిలుస్తుంటుంది. తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో.. సినిమా ప్రమోషన్లకు హాజరైంది చాలా తక్కువ. వ్యక్తిగత కారణాలతో తొలి నుంచీ ప్రమోషన్లకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. ఇందులో రీతు వర్మ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా విశాల్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. విశాల్ తన చిత్రం కోసం మీడియా సమావేశం నిర్వహిస్తే దానికి ఏమాత్రం సంబంధం లేకుండా నయనతార గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.‘‘నటులంతా తమ చిత్రాలని ప్రమోట్ చేసేందుకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ నయన్ ఎందుకు సినిమా కార్యక్రమాలకి హాజరు కావడం లేదు?’’ అని విశాల్ ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనకి ఇష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలమని విశాల్ ఎదురు ప్రశ్నించారు. ‘‘సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం, పాల్గొనకపోవడం రెండూ తప్పు కాదు. కానీ నయనతార పాల్గొంటే బావుంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. అయితే నయనతార ఏ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని, అది ఆమె వ్యక్తిగత హక్కు అని పేర్కొన్నారు.