‘బేబి’ సినిమాను ఓ సాధారణమైన ప్రేమకథగానే ప్రేక్షకులు భావించారు. ఆనంద్ దేవరకొండ .. వైష్ణవి చైతన్య .. విరాజ్ ఈ ముగ్గురూ ప్రధానమైన పాత్రలను పోషించారు. అయితే భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే క్రేజ్ ఈ ముగ్గురికీ ఇంకా రాలేదు. ఇక దర్శకుడు సాయి రాజేశ్ విషయానికి వస్తే, ఆయన ఎక్కువగా కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన నేపథ్యమే ఉంది. అందువలన ఈ సినిమాపై ఎవరికీ కూడా పెద్దగా అంచనాలు లేవు. అందునా రిలీజ్ విషయంలో ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వచ్చింది. అలాంటి ఈ సినిమా చాలా ఫాస్టుగా యూత్ కి కనెక్ట్ అయింది. వారం తిరక్కముందే 50 కోట్ల మార్కును టచ్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు 100 కోట్లకి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దర్శక నిర్మాతలను మెగాస్టార్ అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయిరాజేశ్ తాము మెగా ఈవెంట్ కి రెడీ అవుతున్నట్టు ఒక ట్వీట్ చేశాడు. మెగా ఈవెంట్ అని ఆయన పేర్కొనడం చూస్తే, విజయోత్సవంగా చెప్పుకునే ఈ వేడుకకి చిరంజీవి చీఫ్ గెస్టుగా రానున్నారనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే ఈవెంటును గురించిన ఎనౌన్స్ మెంట్ రావొచ్చు.