ఏపీలో వైసీపీ విధ్వంసకర పాలన కొనసాగుతోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం వైసీపీ పాలనకు చరమగీతం పలకాలని అన్నారు. వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలికేందుకే టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిసిందని చెప్పారు. పొత్తులో ఉన్న ఈ మూడు పార్టీలు వేరైనా… అజెండా మాత్రం ఒకటేనని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైసీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెపుతారని జోస్యం చెప్పారు. తణుకులో బీజేపీ నేతలతో పురందేశ్వరి ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె పైవ్యాఖ్యలు చేశారు. 

కేంద్రంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని పురందేశ్వరి కొనియాడారు. అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని చెప్పారు. పేదవాడి జీవితానికి మోదీ భరోసా కల్పించారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ నిర్మాణం వంటి ఎన్నో గొప్ప పనులు చేశారని చెప్పారు. మోదీ పాలనలో దేశంలో పేదరికం తగ్గుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి విజయం సాధించి… రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తామని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్లా ఎన్డీయే ప్రభుత్వాలే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.