ఏపీ ఎన్నికలలో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతంగా పిఠాపురం ఈ ఎన్నికలలో హాట్ సీట్ గా మారిపోయింది. 2019 ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాలలో ఓటమి చెందడంతో ఈ ఐదేళ్లు ఆ అవమాన భారాన్ని మోస్తూ, వైసీపీ నేతల చీత్కారాలను భరిస్తూ ఈ సారి కొట్టించుకోవడం కాదు మనమే గట్టిగా కొట్టాలి అనే గట్టి పట్టుదలగా జనసేన పని చేసింది . 2024 ఎన్నికల ఫలితాల తరువాత జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో పవన్ గొంతు వినిపించడానికి, ‘పవన్ అనే నేను’…అనే ఒక వాక్యం వినడానికి యావత్తు రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒక పార్టీ అధినేతగా ఉంటూ కూటమి తరుపున రాష్ట్ర వ్యాప్త ప్రచార బాధ్యతలు స్వీకరించిన పవన్ తానూ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఆయనకు పోటీగా వైసీపీ నుండి వంగా గీతా బరిలో నిలిచారు. పిఠాపురం నుండి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ఇస్తానని పిఠాపురంలో ప్రచారం సందర్బంగా వై ఎస్ జగన్ ప్రకటించారు. అయితే ఇదే సూత్రం పవన్ కు వర్తిస్తుందని , ఇక్కడి నుండి పవన్ గెలిస్తే కచ్చితంగా ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తారని జన సైనికులు అనుకుంటున్నారు. మరికొందరేమో పవన్ కళ్యాణ్ ను హోమ్ మినిస్టర్ గా చూడాలనుకుంటున్నట్టు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్రంలో పవన్ కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందని మరికొందరు భావిస్తున్నారు. అయితే పిఠాపురంలో 2019 లో 80. శాతం ఓట్లు పోలవగా ఈసారి ఏకంగా 86. శాతం పోలింగ్ నమోదైంది. ఈ పెరిగిన పోలింగ్ శాతమే పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవటానికి సంకేతమని జన సైనికులు భావిస్తున్నారు.