గత కొన్ని నెలలుగా హోరా హోరీగా సాగిన ఎన్నికల ప్రచార పర్వంతో పాటు ఎన్నికలు ముగిసి ఐదు రోజులు గడిచిపోయాయి. ఇక అందరి ఎదురుచూపులు ఎన్నికల ఫలితాలు వచ్చే జూన్ 4 కోసమే . అయితే ఈసారి ఏపీలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించిన దగ్గరి నుండి ప్రచారం ముగిసేవరకు పవన్ కళ్యాణ్ తన దైన ప్రచార స్టైల్ లో దూసుకెళ్లారు. ప్రజాసేవకై అడుగేసిన పవన్ ఎలాగైనా ఈసారి గెలవాలనే పట్టుదలతో ఎన్ని అడ్డంకులు వచ్చినా తన ప్రచారం ఆపలేదు . తన ప్రసంగాలతో ప్రజలకు చేరువైన పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని ముందుండి నడిపించాడు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరి రామ జోగయ్య ప్రధాని మోదీ కి లేఖ రాశారు. పవన్ డైనమిక్ లీడర్ అని , అందరినీ కలుపుకుంటూ , అందరిలో ఉత్సాహం నింపుతూ ముందుకు కదిలాడని గుర్తు చేశారు. కూటమిలో బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని హరి రామ జోగయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అండగా నిలబడుతూ , ఏపీ ప్రజల్లో చైతన్యం నింపుతూ తన ప్రచారం సాగించాడని , అందుకే ఏపీలో ఓటింగ్ శాతం పెరిగిందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలుపును పిఠాపురం ప్రజలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తికి సముచిత స్థానం కల్పించాలని లేఖలో హరి రామ జోగయ్య మోదీని కోరారు. నిస్వార్థవంతమైన రాజకీయ పరిపాలన కోసం పవన్ కళ్యాణ్ పాటు పడతాడని ఆయన వ్యాఖ్యానించారు. . ఈసారి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ తో కూడిన ఎన్డీయే కూటమి 120 అసెంబ్లీ స్థానాలకు పైగా గెలుస్తుందని మాజీ మంత్రి హరిరామ జోగయ్య ధీమా వ్యక్తం చేశారు. మిగతా సామజిక వర్గంతో పాటు కాపు వర్గం ఓట్లు కూటమికి పడ్డాయంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అని లేఖలో తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ,పవన్ కు కీలక పదవి ఇస్తే సంక్షేమానికి ధోకా ఉండదని తెలిపారు. కాపుల రిజర్వేషన్ల పై కూడా ద్రుష్టి సారించాలని , తాము ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న విద్య , రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ సౌకర్యం పొందటం కావాలన్నారు. మూడు పార్టీలను ఒక్కతాటిపై తీసుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర అధికారంలో కీలక హోదా కల్పించేందుకు కృషి చేయాలనీ లేఖ ద్వారా హరిరామ జోగయ్య, ప్రధాని మోదీని కోరారు