ప్రజాసేవే లక్షంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ఈ దిశగా వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిఠాపురం జిల్లాలోని గొల్లప్రోలు మండలంలో చేబ్రోలు గ్రామంలో పవన్ కళ్యాణ్ ఉండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ ఆయన నివసించనున్న భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎంపిక చేశారు. ఇక వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఈ నెల 7న అనకాపల్లి, 8న ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పర్యటిస్తారని పార్టీ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. అంతేకాకుండా, ఉగాది పండుగ పురస్కరించుకుని ఏప్రిల్ 9న పిఠాపురం నియోజకవర్గంలో జరిగే వేడుకల్లో పవన్ పాల్గొంటారు. జ్వరం కారణంగా పవన్ ప్రచార కార్యక్రమానికి రెండు రోజుల విరామం ప్రకటించారు. ఆదివారం నుంచి యథావిధిగా ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తారని పార్టీ తెలిపింది. విశాఖ దక్షిణం, పెందుర్తి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లోని పవన్ పర్యటన వివరాలు త్వరలో ఖరారు కానున్నాయి.