pawan kalyan about alliance
pawan kalyan about alliance

తన వద్ద వేల కోట్ల రూపాయలు లేవని, సుపారీ గ్యాంగులు లేవని, జాతీయ నేతల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా ముమ్మిడివరంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం 70:30 ప్రభుత్వమని, వంద మంది కష్టాన్ని ముప్పై మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకున్నారని విమర్శించారు. మనలోని అనైక్యత వల్ల కొంతమంది నేతలు మనల్ని భయపెడుతున్నారని ప్రజలను ఉద్దేశించి అన్నారు. కోనసీమలో పెట్రోల్ ఉంది కదా.. అందుకే ఇక్కడి వారిలో ఉద్వేగం ఎక్కువ అన్నారు. కానీ ఇక్కడ తాగునీటి సమస్య ఉందని, మంచి ఆసుపత్రి లేదన్నారు. కోనసీమలో బాలయోగి వంటి వారు ఎన్నో మంచి పనులు చేశారన్నారు.

ఒక్క వ్యక్తి ఎన్నో మంచి పనులు చేస్తే మరి ప్రభుత్వం ఎన్ని పనులు చేయాలని ప్రశ్నించారు. ఉభయ గోదావరి, కోనసీమ ప్రజలకు తాను అండగా ఉంటానన్నారు. ఈ సీఎం ఒక ఎంపీని కొట్టించగలరని, ఒక ఎమ్మెల్సీ ఎస్సీ వ్యక్తిని చంపి డోల్ డెలివరీ చేయగలరని, చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని సీఎం మెచ్చుకుంటారన్నారు. కోనసీమకు అంబేడ్కర్ జిల్లాగా పేరు పెడితే గొడవలు జరిగాయని, వారిని సీఎం ఒప్పించాలి కదా? అన్నారు. మనం అనైక్యంగా ఉంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని హెచ్చరించారు. 80 మంది అనైక్యంగా ఉంటే ఇరవై మంది ప్రభుత్వమే వస్తుందన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఉప్మా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కులం గురించి వైసీపీ నేతలకు ఇబ్బందిగా ఉందని, కులం గురించి మాట్లాడేది మీరా? నేనా? అని ప్రశ్నించారు. మీరు కులాల గురించి మాట్లాడవచ్చు కానీ నేను మాట్లాడకూడదా? అని ధ్వజమెత్తారు. మీరు అమరావతికి కులాలు అంటగట్టవచ్చా? అని ప్రశ్నించారు. కేవలం రెండు కులాలే ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలంటే కుదరదని, అన్ని కులాలు బాగుపడాలన్నారు. ప్రజలను కలిపేవాడు నాయకుడు కానీ… విడగొట్టేవాడు కాదన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధి ద్వారంపూడి కుటుంబంలో అన్ని రకాల అధికారాలు ఉన్నాయన్నారు.

రైతుల కష్టాలను పోగొట్టే ప్రభుత్వం మనకు కావాలని పిలుపునిచ్చారు. నదుల నుండి ఇసుకను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే ఇసుక దోపిడీని అడ్డుకుంటామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పెట్టుబడి కింద ఉచితంగా రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. తాను వస్తున్నానంటే చాలు రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయన్నారు. ఏపీ నేతల దోపిడీ వల్లే తెలంగాణ నేతలు మనల్ని తిట్టారని, ఆంధ్రా వాళ్లమనే భావన లేకపోతే అందరం నష్టపోతామన్నారు. కీలకమైన పదవులు కేవలం రెడ్డి సామాజికవర్గానికే ఇస్తున్నారని ఆరోపించారు. మిగతా కులాల వారిలో ప్రతిభ లేదా? గట్టిగా అడిగేవాడు లేకుంటే ఎవరైనా భయపెడతారన్నారు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా తాను నిలబడే ఉంటానని, తనకు వచ్చే ఎన్నికల్లో అండగా ఉండాలని కోరారు.

Previous articleవైసీపీ జగన్ ది కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం
Next article ఆసియాలోనే అతి పెద్ద ఇళ్ల గృహ సముదాయం