అతను ఓ ప్రభుత్వ ఉద్యోగి .. కానీ ఆ సంగతి మర్చిపోయాడు. వృద్దులకు , ఇతరులకు పంచాల్సిన పెన్షన్ డబ్బులతో పారిపోయాడు .. ఈ సంఘటన విజయవాడలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన ఊటుకూరి నాగమల్లి విజయవాడ మధురానగర్‌లో ఉన్న 208వ నంబరు సచివాలయంలో అడ్మిన్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. నగర పాలక సంస్థ జోనల్‌ 2లో విధు లు నిర్వర్తిస్తున్న జోనల్‌ కమిషనర్‌ కంచర్ల ప్రభుదాసు ఈ నెల మూడో తేదీ సాయంత్రం 6 గంటలకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి 5.41 లక్షలను నాగమల్లికి అందజేశారు. ఆ రోజు రాత్రి 8 గంటల వరకు ఆయన మొత్తం 14 మంది లబ్ధిదారులకు 42 వేలను పంపిణీ చేశాడు. మిగిలిన 4.99 లక్షలను మర్నాడు ఉదయం నుంచి పంపిణీ చేయాల్సి ఉంది.అయితే నాగమల్లేశ్వరరావు నాలుగో తేదీ అందుబాటులో లేకుండాపోయాడు. అధికారులు ఆయనకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. దీంతో ప్రభుదాసు గుణదల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగమల్లిని విజయవాడలో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నాగమల్లిని పోలీసులు ప్రశ్నించగా ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్‌లు ఆడుతున్నట్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఫోన్‌లో బెట్టింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని బెట్టింగ్‌లు ఆడుతున్నట్లు సమాచారం. నాగమల్లిని అరెస్ట్ చేసి మొత్తం సొమ్మును అతడి కుటుంబ సభ్యుల నుంచి రికవరీ చేసిన పోలీసులు అతడిని నాగమల్లిని రిమాండ్‌కు తరలించారు.