సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. జనవరి 6న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని చిత్రబృందం భావించింది. ఈ కార్యక్రమంలోనే థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేయాలని నిర్ణయించింది.

అయితే, సెక్యూరిటీ అనుమతులు లభించకపోవడంతో ఈ ఫంక్షన్ ను వాయిదా వేస్తున్నట్టు గుంటూరు కారం టీమ్ వెల్లడించింది. ముందు నిర్ణయించిన మేరకే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు శాయశక్తులా కృషి చేశామని, కానీ అనుకోని కారణాల వల్ల కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. అభిమానులకు క్షమాపణలు తెలుపుకుంటున్నామని వెల్లడించింది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కొత్త తేదీ ప్రకటిస్తామని గుంటూరు కారం టీమ్ తెలిపింది.