ఎన్నో దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్తున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య లత, సోదరుడు సత్యనారాయణ కూడా వెళ్లనున్నారు. ఈ వేడుకకు హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్వాహకులు రజనీకాంత్ కు స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత 23వ తేదీన ఆయన తిరిగి చెన్నైకు చేరుకుంటారు. ఈ కుంభాభిషేక కార్యక్రమానికి 8 వేల మందిని ఆహ్వానించారు. వీరిలో 3,500 మంది సాధువులు ఉన్నారు. కార్యక్రమానికి హాజరవుతున్న 8 వేల మందికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వసతితో పాటు అన్ని ఏర్పాట్లను చేస్తోంది.