నందమూరి నట సింహం బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. తన కామెడీ పంథాను మార్చుకొని అనిల్ తీస్తున్న పవర్ ఫుల్ చిత్రమిది.  షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో యువ నటి శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం మరో కీలక అప్ డేట్ ఇవ్వనుంది. ‘గీ ముసురు సలిలో మంట లాంటి ముచ్చట’ అంటూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ రోజు 2 గంటల 30 నిమిషాలకు ఈ అప్ డేట్ వస్తోందంటూ పోస్టర్ పేర్కొంది. కొన్నిరోజులుగా వర్షం కారణంగా తెలుగు రాష్ట్రాలలో చల్లటి వాతావరణం నెలకొంది. మరి, ‘భగవంత్ కేసరి’ నుంచి ఈ మధ్యాహ్నం ఇచ్చు ముచ్చట ఏంటో అని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.