ఛత్తీస్ గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజున కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. ఈ తీర్మానంపై అసెంబ్లీలో 13 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు వాయిస్ ఓటింగ్ చేపట్టారు. వాయిస్ ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు స్పీకర్ ప్రకటించారు. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 71 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 13 మంది శాసనసభ్యులు ఉన్నారు.  నిన్న మధ్యాహ్నం నుంచి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. 109 పాయింట్లతో కూడిన ఛార్జ్ షీట్ ను సభలో ప్రవేశపెట్టింది. మరోవైపు బీజేపీ ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలు నిరాధారమైనవని ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ అన్నారు. సభలో ఛార్జ్ షీట్ ను తీసుకురావడం ద్వారా… తమ ప్రభుత్వం సాధించిన విషయాలను సభలో చెప్పుకునే అవకాశాన్ని బీజేపీ కల్పించిందని చెప్పారు.