ఇటీవల ఏపీ విపక్షాలు తిరుమల శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎలుగెత్తడం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీనిపై ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 

తిరుమల శ్రీవాణి ట్రస్టును రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం తగదని హితవు పలికారు. ట్రస్టు విధివిధానాలు, కార్యకలాపాల గురించి ఏమాత్రం తెలియనివాళ్లే ఆరోపణలు చేస్తుంటారని విమర్శించారు. శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేసేవాళ్లు ఆధారాలతో ముందుకు రావాలని మంత్రి అంబటి స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులను టీటీడీ హిందూ ధార్మిక ప్రచారం కోసం ఉపయోగిస్తుందని వెల్లడించారు. గొప్ప ఆశయంతో తీసుకువచ్చిన శ్రీవాణి ట్రస్టును అప్రదిష్ఠపాల్జేయడం సరికాదని అన్నారు. శ్రీవాణి ట్రస్టు విధానాలు దళారీలకు చోటు లేని విధంగా ఉంటాయని తెలిపారు.