ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథల్లో ‘బేబి’ ఒక రేంజ్ లో యూత్ కి కనెక్ట్ అయింది. ఆనంద్ దేవరకొండ .. వైష్ణవి చైతన్య .. విరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రెండోవారంలోను తన జోరు చూపిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమా ఈ వీకెండ్ కి 50 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. కానీ నిన్ననే ఈ సినిమా 50 కోట్ల మార్కును దాటేసింది. నిన్నటితో 8 రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా, 54 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఒక మీడియం రేంజ్ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. నిజానికి నిన్న కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు ఓ మూడు వరకూ రిలీజ్ అయ్యాయి. అందువలన ‘బేబి’ వసూళ్లపై ఎంతో కొంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందనుకున్నారు. కానీ నిన్న విడుదలైన కొత్త సినిమాల ఎఫెక్ట్ కూడా ఈ సినిమా వసూళ్లపై ఎంత మాత్రం పడలేదు. ఈ సినిమా వలన కొత్త సినిమాల షోలు కూడా కొన్ని చోట్ల కేన్సిల్ కావడం విశేషం.