ఒకరేమో టాలీవుడ్ సూపర్ స్టార్… మరొకరేమో బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్న ఏస్ డైరెక్టర్… ఇదంతా మహేశ్ బాబు, రాజమౌళి గురించేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు హేమాహేమీల కాంబినేషన్లో వస్తున్న చిత్రంపై ఏ చిన్న సమాచారం బయటికి వచ్చినా అభిమానులు ఊగిపోతున్నారు. రాజమౌళి తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. 

రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని బళ్లారిలో అమృతేశ్వర ఆలయ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం రాజమౌళిని స్థానిక రాజకీయ నేతలు కలిసి ముచ్చటించారు. 

ఈ సందర్భంగా జక్కన్న మహేశ్ బాబుతో మూవీపై స్పందించారు. మహేశ్ బాబుతో తాను సినిమా తీస్తున్నానని, త్వరలోనే షూటింగ్ మొదలుపెడుతామని వెల్లడించారు. అయితే, ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదని తెలిపారు. రాజమౌళి తాజా వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోను విపరీతంగా సర్క్యులేట్  చేస్తున్నారు.

కాగా, మహేశ్ బాబు-రాజమౌళి కలయికలో వచ్చే అడ్వెంచరస్ చిత్రానికి ‘మహారాజ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.