తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ – జనసేన సభ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ సభకు ఇరు పార్టీల శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. అయితే, సభా వేదికపై జనసేన నేత నాగబాబు కనిపించకపోవడం అందరినీ కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో సభకు తాను ఎందుకు హాజరు కాలేదో నాగబాబు వీడియో ద్వారా వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా వేదిక వద్దకు చేరుకోవాలని తమకు ఎంతో మర్యాదగా ముందే చెప్పారని… అయితే, మావాడు ఒకడు 4 గంటలకు బయల్దేరితే సరిపోతుందని చెప్పాడని నాగబాబు తెలిపారు. తాము 4 గంటలకు బయల్దేరి వచ్చే సరికి సభ జరుగుతున్న ప్రదేశమంతా జనసేన, టీడీపీ శ్రేణులతో కిక్కిరిసి పోయిందని, రోడ్డుపై తన కారు ముందుకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఇంతటి దిగ్విజయ సభలో తాను పాల్గొనలేనందుకు ఒకింత బాధగా ఉన్నా… తాను కనీసం అటు పోలేనంత జన సందోహంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయేంత విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.