పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన ‘బ్రో’ సినిమాలో కనిపించిన పవన్ ఈ మధ్యే ‘ఓజీ’ చిత్రం గ్లింప్స్ తో అభిమానులను అలరించారు. ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు గబ్బర్ సింగ్ తో తనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్ తో పవన్ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ నిన్న హైదరాబాద్‌లో మొదలైంది. ఈ విషయాన్ని చెబుతూ చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్‌ ఖాకీ డ్రెస్సులో స్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. వీటికోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో భారీ సెట్‌ను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో పవన్ సరసన యువ నటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అశుతోష్‌ రానా, నవాబ్‌షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Previous article ఎన్నికలకు సిద్ధంకండి…కిషన్ రెడ్డి
Next articleచంద్రబాబు వద్దకు వెళ్లేందుకు లోకేశ్ యత్నం… పోలీసులు అడ్డుకోవడంతో వర్షంలోనే నిరసన