పవన్ కల్యాణ్ – సాయితేజ్ కలిసి ‘బ్రో’ సినిమాలో నటించారు. ‘భీమ్లా నాయక్’ హిట్ తరువాత పవన్ .. ‘విరూపాక్ష’ హిట్ తరువాత సాయితేజ్ కలిసి నటించిన సినిమా ఇది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తమిళంలో కొంతకాలం క్రితం హిట్ కొట్టిన ‘వినోదయా సితం’ సినిమాకి ఇది రీమేక్. అక్కడా .. ఇక్కడా దర్శకుడు సముద్రఖనినే. అయితే తమిళంలో ఈ సినిమా ఎలాంటి స్టార్ ఇమేజ్ తోడు లేకుండా నడుస్తుంది. అందువలన తెలుగులో పవన్ క్రేజ్ కి తగినట్టుగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను మార్చడం జరిగింది. అలాగే ఆయనే ఈ సినిమాకి సంభాషణలు సమకూర్చాడు. ఈ కారణంగా కూడా ఈ సినిమా మరింత క్రేజ్ ను సంతరించుకుంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తనకి టైమ్ లేదు .. టైమ్ లేదు అంటూ హడావిడి చేసే తేజు పాత్ర హఠాత్తుగా టపా కట్టడం .. ఆ టైమే తాను అంటూ అతనితో మిగతా డ్రామా నడిపించే దైవశక్తిగా పవన్ ఎంట్రీ ఇవ్వడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది.    ఒక్క ట్రైలర్ తోనే పాత్రలు .. వాటి స్వభావాలు .. కథ అర్థమయ్యేలా చేయడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. బ్రహ్మానందం కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ప్రియా ప్రకాశ్ వారియర్ – కేతిక శర్మ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, ఏ స్థాయిలో పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందనేది చూడాలి.