ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సినిమాలే వీకెండ్ తరువాత థియేటర్లలో నిలబడటం కష్టంగా ఉంది. ఇక ఓ మాదిరి సినిమాలు శుక్రవారం తరువాత థియేటర్ల దగ్గర కనిపించడమే లేదు. ఇక కొన్ని చిన్న సినిమాల విషయానికొస్తే, విడుదల రోజునే చాలా థియేటర్లలో షోస్ కేన్సిల్ అవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. 

అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ‘బేబి’ 25 రోజులను పూర్తిచేసుకోవడం విశేషం. ఎస్.కె.ఎన్.నిర్మించిన ఈ సినిమాకి సాయిరాజేశ్ నీలం దర్శకత్వం వహించాడు. ఆనంద్ దేవరకొండ .. విరాజ్ .. వైష్ణవి చైతన్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జులై 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. నిన్నటితో ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన ముగ్గురికీ, ఈ సినిమాకి ముందున్న క్రేజ్ అంతంత మాత్రమే. దర్శకుడు సాయిరాజేశ్ చేసిన సినిమాలు కూడా రెండు మూడు మాత్రమే. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు .. కథాపరంగా చూసుకుంటే విలన్ కూడా లేడు. అయినా ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి.