అగ్ర హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. భారీ అంచనాల మధ్య ఇది ఈ రోజే విడుదలైంది. ‘రారా కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మహేశ్‌.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విడుదల సందర్భంగా మహేశ్ సినిమా, నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇలాంటి కొత్త తరహా కథల్లో నటించడానికి మన తారలు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. అనుష్కకి ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు ఆమె ఎంతో ఆస్వాదిస్తూ విన్నారని వెల్లడించాడు. ఆ తర్వాత నవీన్‌కు కథ చెబితే  మూడు నెలలు సమయం తీసుకుని ఓకే చెప్పాడన్నాడు. రెండు ప్రధాన పాత్రలపై సాగే సినిమా కావడంతో అందుకు తగ్గట్టే ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ అనే పేరు పెట్టామని వెల్లడించాడు.  ఇక, దర్శకుడిగా తాను తీసిన రెండో సినిమాకే అగ్ర కథానాయకుడు చిరంజీవి నుంచి అభినందనలు రావడం తనకు గొప్ప విషయం అన్నాడు. చిరంజీవి, సురేఖ దంపతులతోపాటు ఆ కుటుంబంలో పదిమంది ఈ చిత్రాన్ని చూశారని, వెంటనే మెగాస్టార్ ఫోన్‌ చేసి మెచ్చుకోవడంతో సంతోషంలో ఊగిపోయానన్నాడు. తనను, హీరో నవీన్‌ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారన్నాడు. గంటన్నర సమయం మెగాస్టార్ ఇంట్లో గడపడం మరిచిపోలేని అనుభూతిని, ఉత్సాహాన్ని ఇచ్చిందని మహేశ్ చెప్పుకొచ్చాడు.