ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్లలో ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. కౌకుంట్ల గ్రామ పరిధిలో హంద్రీ కాలువ, పవన విద్యుత్ ప్రాజెక్టు, డ్రిప్ ఇరిగేషన్ వద్ద సెల్ఫీలు దిగి వైసీపీ ప్రభుత్వానికి సవాల్ చేశారు. హంద్రీనీవా కాల్వ పనుల్లో ఎవరి హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా? అంటూ నిలదీశారు. టీడీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా వచ్చిన విండ్ ఎనర్జీ టవర్స్‌ను చూపిస్తూ చంద్రబాబు సెల్ఫీ దిగారు. విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ల ద్వారా ఎవరి హయాంలో ఎంత ఉత్పత్తి జరిగిందో చెప్పగలరా? అంటూ జగన్‌కు సవాల్ విసిరారు. నాడు డ్రిప్ ఇరిగేషన్‌కు ఇచ్చిన సబ్సిడీలను ప్రస్తావిస్తూ… అనంతపురంలో మొదలు పెట్టిన సామాజిక డ్రిప్ ప్రాజెక్టు ఏమైంది? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అభివృద్ధి చేసిన చోట సెల్ఫీలు దిగి ఇదీ ప్రజలకు మేలు చేసే విధానం అన్నారు.