టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. నెల్లూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి  కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. 

ఇవాళ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని, ఎన్టీఆర్… టీడీపీని స్థాపించిన గొప్ప రోజు ఇది అని అభివర్ణించారు. ఈ 42 ఏళ్లలో తెలుగువారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశామని చెప్పారు. అనేక విజయాలు సాధించామని, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా పనిచేయడమే కాకుండా, ప్రభుత్వాల ఏర్పాటుతో ముందుకు పోయామని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తెలుగుజాతికి తిరుగులేదని నిరూపించగలిగాం అని తెలిపారు.