మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకెళ్తోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు మధ్యలో స్పెషల్ సాంగ్స్‌ తో చాలా బిజీగా ఉంది. తాజాగా ఆమె ఖాతాలో మరో బాలీవుడ్ చిత్రం చేరింది. బాలీవుడ్ కండల వీరుడు జాన్‌ అబ్రహం హీరోగా నిఖిల్ అద్వానీ తెరకెక్కిస్తున్న ‘వేదా’ అనే చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం ప్రకటించింది. జాన్‌ అబ్రహం, దర్శకుడు నిఖిల్ తో దిగిన ఫొటోలను తమన్నా తన ట్విట్టర్ లో షేర్ చేసింది.

ఈ సినిమా బలమైన కథతో పాటు మునుపెన్నడూ చూడని పోరాట సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసీమ్ అరోరా కథ అందించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. జీ స్టూడియాస్, ఎమ్మాయ్ ఎంటర్ టైన్మెంట్, జేఏ ఎంటర్‌‌ టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం తమన్నా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో హీరోయిన్ గా నటించింది.