ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న చిత్రం భోళాశంకర్. ఆచార్య, గాడ్ ఫాదర్ తరహాలో సీరియస్ కథాంశం కాకుండా, భోళాశంకర్ లో మాస్ ఎంటర్టయినింగ్ అంశాలు పుష్కలంగా ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 11న భోళాశంకర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.కాగా, ఈ నెల 27న భోళాశంకర్ నుంచి మెగా ట్రైలర్ విడుదల కానుందని చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. అభిమానులూ… మెగా ఎంటర్టయినింగ్ యాక్షన్ కోసం గెట్ రెడీ అంటూ దర్శకుడు మెహర్ రమేశ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం మహతి స్వరసాగర్ బాణీలు కట్టిన పాటలు ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంటున్నాయి. భోళాశంకర్ చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, మరో అందాలభామ కీర్తి సురేశ్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది.