సౌతిండియా సూపర్‌‌ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి చెన్నైలో ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సూపర్‌‌ స్టార్‌‌’ అనే ట్యాగ్ తనకు ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉందని చెప్పారు. ‘‘జైలర్ సినిమాలోని ‘హుకుమ్’ పాటను మొదటిసారి విన్నప్పుడు ఎంతో ఇష్టపడ్డా. అందుకే పాట వీడియో నుంచి ‘సూపర్ స్టార్’ ట్యాగ్‌ను తీసివేయమని మేకర్స్‌ని కోరాను. ఆ ట్యాగ్ నాకు ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉంది” అని వివరించారు.అన్నాత్తే (తెలుగులో ‘పెద్దన్న’) సినిమా తర్వాత చాలా కథలను విన్నానని, కానీ అవి బాషా, అన్నామలై మాదిరి అనేపించడంతో తిరస్కరించానని చెప్పారు. ఈ సినిమాను తాను దర్శకుడు నెల్సన్‌తో చేయడంపై విమర్శలు వచ్చాయని, కొందరు డైరెక్టర్‌‌ను మార్చాలని అన్నారని గుర్తు చేశారు. నెల్సన్‌తో కలిసి పనిచేయాలనే తన నిర్ణయంపై తనకు స్పష్టత ఉందని చెప్పారు. ఇక ఆడియో రిలీజ్ కార్యక్రమానికి కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు హాజరయ్యారు.