బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో తనను ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చిన అంపైర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాట్‌తో స్టంప్స్‌ను కొట్టిన భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. ఆ మ్యాచ్‌లో అంపైరింగ్‌ చెత్తగా ఉందంటూ బహిరంగంగా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించింది. హర్మన్‌ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించింది. క్రమశిక్షణ ఉల్లంఘన కింద మూడు డీమెరిట్ పాయింట్లను భారత కెప్టెన్ ఖాతాలో జమ చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దాంతో ఆమెపై నిషేధం కత్తి వేలాడుతోంది. రాబోయే 24 నెలల్లో మరో డీమెరిట్ పాయింట్ హర్మన్‌ ఖాతాలో చేరితే ఒక టెస్టు మ్యాచ్‌ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు (వన్డే లేదా టీ20) ఆడకుండా ఆమెపై నిషేధం వేటు పడుతుంది.  శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ టై అయింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ ను ఇరు జట్లూ పంచు కున్నాయి. అయితే, అంపైరింగ్‌ నాసిరకంగా ఉందని మ్యాచ్‌ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ సెర్మనీలో హర్మన్‌ చెప్పడం చర్చనీయాంశమైంది. అలాగే, ఇరు జట్ల క్రికెటర్లు ట్రోఫీతో ఫొటోలు దిగుతుండగా అంపైర్లను కూడా పిలవండి.. వాళ్లు కూడా మీ జట్టులో భాగమే అంటూ బంగ్లాదేశ్ కెప్టెన్‌ నిగర్ సుల్తానాతో అనడం విమర్శలకు తావిచ్చింది. హర్మన్‌ మాటలకు నొచ్చుకకున్న నిగర్ అసహనంతో తమ క్రికెటర్లను డ్రెస్సింగ్ రూమ్‌కి తీసుకెళ్లింది.