భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ , మాజీ కెప్టెన్ పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ ఒకేరోజు ఒకేసారి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కాగా వారి నిర్ణయం భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. సౌత్ ఆఫ్రికాతో ఫైనల్‌లో అద్భుత ఆటతీరుతో భారత్ విజయానికి బాటలు వేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లీ చెప్పాడు. ఇదే తన చివరి ప్రపంచకప్ అని, మేం ఏం కోరుకున్నామో అది సాధించామని పేర్కొన్నాడు. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సుదీర్ఘకాలం వేచి చూసినట్టు చెప్పాడు. రోహిత్ 9 ప్రపంచకప్‌లు ఆడాడని, తాను ఆరు ఆడానని పేర్కొన్నాడు. తన కెరియర్‌లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడిన విరాట్ కోహ్లీ 4,188 పరుగులు చేశాడు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రోహిత్‌శర్మ కూడా తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో బార్బడోస్‌లో జరిగిన ఫైనల్‌లో సంచలన విజయం సాధించిన అనంతరం రోహిత్ శర్మ కూడా టీ20 క్రికెట్ కు వీడుకోలు పలుకుతున్నట్టు ప్రకటించారు. టీ ట్వంటీకి వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని, ఇంతకుమించి సరైన సందర్భం ఉంటుందని తాను అనుకోవడం లేదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదని, ట్రోఫీ గెలవాలనుకున్నానని, గెలిచానని చెప్పాడు. కాగా రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో159 మ్యాచ్‌లు ఆడి 4,231 పరుగులు చేయగా ఇందులో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి