ఐపీఎల్ 2024 లో ఫైనల్ లో తలపడేదెవరో తేలిపోయింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ పై విజయంతో ఎస్ ఆర్ ఎచ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ధ్రువ్ జురెల్ అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు . 2018 తర్వాత మళ్లీ ఫైనల్ కు చేరడం సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇదే తొలిసారి. అయితే ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలవడానికి ముఖ్య కారణం కోచ్ డేనియల్ వెటోరి. అతడు తీసుకున్న నిర్ణయమే సన్ రైజర్స్ ను గెలిపించింది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే సన్ రైజర్స్ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. ఒక దశలో 120 పరుగులకే 6 వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టులో డేనియల్ వెటోరి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తుది జట్టులో లేని షాబాజ్ అహ్మద్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తుది జట్టులోకి తీసుకువచ్చాడు. ఆ సమయంలో ఈ నిర్ణయం సన్ రైజర్స్ అభిమానులను విస్మయానికి గురి చేయగా ఈ నిర్ణయమే చివరికి సన్ రైజర్స్ విజయానికి కారణం అయ్యింది. క్లాసెన్, షాబాజ్ కలిసి 7వ వికెట్ కు 43 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బ్యాట్ తో పెద్దగా రాణించకపోయినా బంతితో షాబాజ్ మెరిశాడు .షాబాజ్ అహ్మద్ 8వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చి కీలకమైన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, అశ్విన్ లను అవుట్ చేసి మ్యాచ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయానికి బాటలు వేశాడు. 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చిన షాబాజ్ అహ్మద్ ఏకంగా 3 వికెట్లు సాధించాడు.షాబాజ్ తో పాటు అభిషేక్ శర్మ కూడా కీలకమైన సంజూ సామ్సన్, హెట్ మైర్ వికెట్లను సాధించి జట్టు విజయానికి కారణం అయ్యాడు. కాగా షాబాజ్ ను బరిలోకి దించాలనే నిర్ణయం వెటోరిదే అంటూ కమిన్స్ కూడా మ్యాచ్ అనంతరం చెప్పాడు.