మరో 40 రోజుల్లో వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది. మన దేశంలోనే జరగనున్న ఈ టోర్నీలో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారనే విషయంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ టాప్‌ స్కోరర్‌‌గా నిలుస్తాడని అంచనా వేశాడు. ఈ మేరకు సెహ్వాగ్ మాట్లాడుతున్న వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “రోహిత్ శర్మ కేవలం ఆటగాడిగానే కాదు.. కెప్టెన్‌గానూ బరిలో దిగుతున్నాడు. వరల్డ్‌ కప్ అంటే చాలు అతడిలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. అద్భుతమైన ప్రదర్శనలతో చెలరేగుతాడు. ఈ సారి కూడా ఎక్కువ పరుగులు చేస్తాడు” అని అంచనా వేశాడు.భారతదేశంలోని పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, దీంతో ఓపెనర్లు ఎక్కువ పరుగులు చేయగలుగుతారని అన్నాడు. ‘‘బాగా ఆడేవాళ్లలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలంటే నేను రోహిత్‌ను ఎంచుకుంటా. కొందరు ప్లేయర్లు ఉన్నారు కానీ.. నేను ఇండియన్‌ను కాబట్టి.. ఇండియన్ ప్లేయర్ రోహిత్ శర్మనే ఎంచుకుంటా” అని అందులో సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 5 నుంచి మన దేశంలో వన్డే వరల్డ్‌ కప్ జరగనుంది.