ఉచిత విద్యుత్‌పై పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు జారితే తాను లాగ్ బుక్‌ను బయటపెట్టి నష్టనివారణ చేశానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో నకిరేకల్ నియోజకవర్గంలో కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎవరో వస్తున్నారనే వార్తలు నమ్మి కార్యకర్తలు అనవసరంగా ఆవేశపడవద్దన్నారు. బీఆర్ఎస్ రాజీనామా చేస్తే కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడం వల్లే అవతలి వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. కార్యకర్తలు ఎవరి పేరు చెబితే వారినే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.మరో వారం రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారవుతారన్నారు. బీఆర్ఎస్ హయాంలో చాలామందికి రైతుబంధు అందలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదిన్నర గంటలు మాత్రమే కరెంట్ ఇస్తోందని ఆరోపించారు. ఈసారి కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని స్థానాలకు అభ్యర్థులు ఉన్నారని, కొత్తగా ఎవరూ చేరాల్సిన అవసరం లేదని గతంలోనే కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Previous articleపల్లా రాజేశ్వర్ రెడ్డి ‘కుక్క’ వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫైర్!
Next article వచ్చే వరల్డ్‌కప్‌లో టాప్ స్కోరర్ అతడే.. అంచనా వేసిన సెహ్వాగ్…!