స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు విచారణ సందర్భంగా సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరపు లాయర్లు హైకోర్టుకు సమర్పించారు. 

చంద్రబాబు కంటికి ఆపరేషన్ నిర్వహించామని… ఆయన కోలుకోవడానికి మందులు వాడాలని డాక్టర్లు నివేదికలో తెలిపారు. ఐదు వారాల పాటు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చామని… ఐదు వారాల పాటు ఇన్ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలని, కంట్లో చుక్కల మందు వేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారని… గుండె పరిమాణం పెరిగిందని, గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరమని చెప్పారు. ఈ నేపథ్యంలో విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మిగిలిన వాదనలు రేపు వింటామని తెలిపింది.