తెలంగాణలో పట్టు సాధించాలనే కృతనిశ్చయంతో బీజేపీ హైకమాండ్ ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ నేతలకు గవర్నర్, కేంద్ర మంత్రుల పదవులను కట్టబెడుతోంది. తాజాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో కీలక పదవిని తెలంగాణ నేతలకు ఇచ్చింది. సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమించింది. ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అండగా ఉంటూ… బీజేపీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రసేనారెడ్డిది సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామం. ఆయన రాజకీయ ప్రస్థానం ఏబీవీపీతో మొదలయింది. ఏబీవీపీలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పని చేశారు. ఆ తర్వాత బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన చరిత్ర ఆయనది.