అక్కినేని నాగార్జున కుటుంబంలో విషాదం నెలకొంది. నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు. నాగ సరోజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో నిన్న ముంబయిలో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. నాగ సరోజ అవివాహిత అని సమాచారం. ఆమె ఇటీవల హైదరాబాదులో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుక వేళ అక్కినేని విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ పాల్గొన్నట్టు వెల్లడైంది. అక్కినేని విగ్రహావిష్కరణ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. కాగా, నాగ సరోజ అంత్యక్రియల సమాచారం తెలియరాలేదు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు నాగ సుశీల, నాగ సత్యవతి, నాగ సరోజ, వెంకట్, నాగార్జున సంతానం. వీరిలో నాగ సత్యవతి చాన్నాళ్ల కిందటే కన్నుమూశారు.